Country: ఆంధ్రప్రదేశ్
పతనం దిశగా వెండి …..⤵️
వెండి రేటు రూ.1.30 లక్షలు డౌన్
కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి.
కేజీ వెండి ధర ఏకంగా 1,30,000 రూపాయలు పడిపోయి 2,90,000 రూపాయలు పలికింది.
కుప్పకూలిన వెండి ధరలు..
వెండి మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పతనం పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది. కిలో రూ.4 లక్షల మార్కును తాకిన వెండి.. కేవలం ఒక్క రోజులోనే 25 శాతం(దాదాపు రూ.1,30,000) కుప్పకూలి రూ. 2,90లక్షల స్థాయికి చేరడం మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద దిద్దుబాటుగా నిలిచింది.
అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వెండిని కొనడం సురక్షితమేనా? నిపుణులు ఏం సూచిస్తున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వెండి ధరల పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
వెండి ధరలు ఇంత వేగంగా పడిపోవడానికి ప్రధానంగా మూడు అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి.
డాలర్ పుంజుకోవడం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్ గా కెవిన్ వార్డ్‌ను నామినేట్ చేయడంతో మార్కెట్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కెవిన్ వార్ష్ కఠిన ఆర్థిక విధానాల వైఖరి కలిగిన వ్యక్తిగా పేరుపొందారు. ఆయన రాకతో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో డాలర్ ఇండెక్స్ బలపడింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి లోహాలపై ఒత్తిడి పెరుగుతుంది.
బంగారం ధరల పతనం: అంతర్జాతీయ మార్కెట్లో
బంగారం ధరలు కూడా సుమారు 9 శాతం వరకు క్షీణించాయి. వెండి ఎప్పుడూ బంగారం కదలికలను మరింత వేగంగా అనుకరిస్తుంది. అందుకే బంగారం కంటే వెండిలో పతనం మరింత తీవ్రంగా ఉంది.
భారీ లాభాల స్వీకరణ: గత కొద్ది నెలలుగా వెండి
అద్భుతమైన లాభాలను అందించింది. ధరలు గరిష్ట స్థాయికి చేరగానే భారీ ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్లు ఒక్కసారిగా తమ లాభాలను నగదుగా మార్చుకోవడం (అమ్మకాలు చేపట్టడం) ప్రారంభించారు. ఒకేసారి భారీగా అమ్మకాలు జరగడం వల్ల ధరలు కుప్పకూలాయి.
కొనుగోలుకు ఇది సరైన సమయమేనా?
వెండి ధరలు అమాంతం పడిపోవడంతో ఇప్పుడు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమా లేక ముప్పుగా పరిణమిస్తుందా? అన్న సందేహం నెలకొంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితిని ఇలా విశ్లేషించవచ్చు.
1. మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది..
వెండి మార్కెట్లో పతనం ఇప్పుడే ప్రారంభమైంది. అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ‘లాభాల స్వీకరణ’ జరుగుతుండటంతో ధరలు మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ధరలు ఒక నిర్దిష్ట స్థాయి (మద్దతు ధర) వద్ద స్థిరపడే వరకు కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడం రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2. వెండిలో ‘ఓవర్ బాట్’ జోన్
గత కొన్ని నెలల్లో వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఏ ఆస్తి అయినా ఇంత వేగంగా పెరిగినప్పుడు ‘ప్రైస్ కరెక్షన్’ అనేది సహజం. ప్రస్తుతం జరుగుతున్నది అదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ధరలు మరింత దిగివచ్చి, రూ. 2.5 లక్షల నుంచి రూ. 2.8 లక్షల మధ్య స్థిరపడే అవకాశం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.
3. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అవకాశం
మీరు 3 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ పతనం మీకు ఒక వరమే. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs),సెమీకండక్టర్ల తయారీలో వెండి వాడకం విపరీతంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది దీర్ఘకాలంలో ధరలు మళ్లీ పెరగడానికి దోహదపడుతుంది.
పెట్టుబడిదారులకు నిపుణుల కీలక సూచనలు
మీరు ఈ సమయంలో వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ జాగ్రత్తలు పాటించండి:
ఒకేసారి పెట్టుబడి పెట్టకండి : మీ దగ్గర ఉన్న డబ్బునంతటినీ ఇప్పుడే వెండిపై పెట్టకండి. ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున, దశలవారీగా పెట్టుబడి పెట్టండి.
SIP విధానం ఉత్తమం: వెండి ఈటీఎఫ్‌లు లేదా డిజిటల్
సిల్వర్ ద్వారా నెలకు కొంత చొప్పున పెట్టుబడి పెట్టడం వల్ల ‘రూపీ కాస్ట్ యావరేజింగ్’ ప్రయోజనం అందుతుంది.
పోర్ట్‌ఫోలియో బ్యాలెన్సింగ్: మీ మొత్తం పెట్టుబడిలో
బంగారం, వెండి కలిపి 10-15శాతం మించకుండా చూసుకోండి. కేవలం వెండిపైనే ఆధారపడటం ప్రమాదకరం.
స్టాప్ లాస్ పాటించండి: స్వల్పకాలిక ట్రేడర్లు అయితే, రూ.3,00,000 స్థాయిని నిశితంగా గమనించాలి. దానికంటే దిగువకు వెళ్తే మరింత పతనం ఉండవచ్చు.
మొత్తానికి ఇలా..
- ప్రస్తుతానికి వెండి మార్కెట్ “వేచి చూడండి” మోడ్‌లో ఉంది. ధరలు ఒక చోట స్థిరపడిన తర్వాతే కొనుగోళ్లు ప్రారంభించడం సురక్షితం. ఆవేశంతో ఎగబడి కొనడం కంటే, మార్కెట్ కదలికలను గమనిస్తూ అడుగు వేయడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
y.sarath Kumar (Ysk)
