ప్రజల సొమ్మును కక్కుర్తి పడి తింటే అధికారులు ఊరుకోరని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గారు మరోసారి నిరూపించారు. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామ పంచాయతీలో సాగిన నిధుల అక్రమ దందాపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రూ. 25,94,268/- (అక్షరాలా పాతిక లక్షల తొంభై నాలుగు వేల పైచిలుకు) రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేసిన సర్పంచ్ కె. వెంకటేశ్వరమ్మ నుండి ఆ మొత్తాన్ని తక్షణమే రికవరీ చేయాలని కలెక్టర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
గతంలోనే ఈ సర్పంచ్ అక్రమాలపై విచారణ జరిపి 6 నెలల పాటు ‘చెక్ పవర్’ రద్దు చేస్తూ అధికారులు శిక్ష విధించారు. అయినప్పటికీ, స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయడంలో జాప్యం జరుగుతుండటంతో, బాధితుడు గుండె పాండురంగ నిరంతరం అధికారులను వెంటాడారు. ది.09-01-2026న PGRS ద్వారా ఆయన చేసిన ఫిర్యాదుతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్-1994 ప్రకారం సర్పంచ్‌ను బాధ్యురాలిగా నిర్ధారిస్తూ కలెక్టర్ కార్యాలయం (పి.ఆర్. ఓ, సి, జి ఎస్ నెం: E-8701/A8/2024) ఉత్తర్వులు వెలువరించింది.
మార్చి 14న సర్పంచ్‌కు పంపిన నోటీసులో అధికారులు స్పష్టమైన గడువు విధించారు. 15 రోజుల లోపు దుర్వినియోగం చేసిన రూ. 25.94 లక్షలను తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. ఒకవేళ నిర్ణీత సమయం దాటితే, ఆ నిధుల రికవరీ కోసం మరింత కఠినమైన చర్యలు (తదుపరి చట్టపరమైన చర్యలు) తీసుకోవడం జరుగుతుందని ఎండార్స్మెంట్ ద్వారా అధికారులు హెచ్చరించారు.
- సర్పంచ్ పీఠంపై ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడాల్సింది పోయి, పంచాయతీ నిధులను సొంతానికి వాడుకోవడంపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. తక్షణమే ఆ సొమ్మును రికవరీ చేసి, గ్రామంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
y.sarath Kumar (Ysk)
